mahesh kumar goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేయడం తగదని, ఇది పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని అన్నారు. స్థానిక ఎన్నికల విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సూచనలు ఇచ్చామని, ఆయన ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కొందరు నేతలు ఇష్టారీతిగా మాట్లాడడం పట్ల అసహనం వ్యక్తం చేసిన మహేశ్, కొండ మురళి వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, పరిస్థితులపై పూర్తి నివేదిక కోరామని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ పాటించకుంటే చర్యలు తప్పవని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అజారుద్దీన్ పోటీపై అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో మళ్లీ ప్రయత్నించడంలో తప్పేమీ లేదన్నారు.