Mahesh Kumar goud: తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వివాదం పెద్దది కాదని, “ఇది మా కుటుంబ సమస్య మాత్రమే, మేమే పరిష్కరించుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఖర్గేకు పేస్మేకర్ అమర్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యపరంగా ఆయనను పరామర్శించడానికి గౌడ్ ఢిల్లీ వెళ్లారు.
తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, “సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య తలెత్తిన అపార్థాలు, విభేదాలు ఏర్పడ్డాయి. ఇవి తక్షణమే సర్దుబాటవుతాయి,” అని చెప్పారు.
అలాగే బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఖర్గేకు వివరించినట్లు తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పార్టీ నిర్ణయించిందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.