Mahesh Babu: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై రోజుకో కొత్త ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచిన ఈ సినిమా కోసం మహేష్ బాబు అత్యంత కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్టు తాజాగా స్పష్టమైంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రాచీన భారతీయ యుద్ధవిద్య అయిన కలరీపాయట్టులో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
ఈ శిక్షణను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ హరిక్రిష్ కాకాని అందిస్తున్నారు. కేరళలో ఆవిర్భవించిన కలరీపాయట్టు యుద్ధకళను సహజంగా, ప్రామాణికంగా తెరపై చూపించేందుకు మహేష్ బాబు ఈ శిక్షణ తీసుకున్నారని హరిక్రిష్ తెలిపారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. సూపర్ స్టార్‌కు పురాతన యుద్ధకళలో శిక్షణ ఇవ్వడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
Also Read: Baahubali The Epic: డిజిటల్‌లోకి ‘బాహుబలి ది ఎపిక్’ .. ఓటీటీలోనూ రాజ్యమేలనున్న మాహిష్మతి
‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇది టైమ్ ట్రావెల్ అంశాలతో కూడిన గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే ఈ కథలో మహేష్ సాహసికుడిగా, రాముడి ఛాయలున్న గంభీరమైన పాత్రలో నటిస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా పొడవాటి జుట్టు, పూర్తి గడ్డం పెంచడంతో పాటు శారీరకంగా తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. కలరీపాయట్టు శిక్షణ వల్ల యాక్షన్ సన్నివేశాలు మరింత సహజంగా, రియలిస్టిక్‌గా ఉంటాయని చిత్ర బృందం భావిస్తోంది.
ఈ చిత్రాన్ని సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. కె.ఎల్. నారాయణ, కార్తికేయ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ‘వారణాసి’ను ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత గ్రాండ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. రాజమౌళి మార్క్ విజన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ విలువలతో ‘వారణాసి’ గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
