Viral News: రష్యన్ ఆల్కహాల్ బ్రాండ్ రివార్ట్స్ తయారు చేసిన బీర్ డబ్బాలపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సుబర్ణో సత్పతి భారత ప్రభుత్వాన్ని రష్యాతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మహాత్మా గాంధీ మద్యనిషేధానికి ప్రతీక అని, ఆయన బొమ్మను బీర్ టిన్లపై ముద్రించడం అవమానకరమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు గాంధీ బొమ్మను మద్యం ఉత్పత్తులపై ఉపయోగించడం ఆయన విలువలకు విరుద్ధమని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రివార్ట్స్ కంపెనీ గతంలో కూడా వివిధ ప్రపంచ నాయకుల పేర్లు, బొమ్మలు మద్యం ఉత్పత్తులపై ఉపయోగించినట్లు సమాచారం. 2018 ఫిఫా వరల్డ్ కప్ సమయంలో కూడా గాంధీ బొమ్మ ఉన్న బీర్ టిన్లు హైలైట్ అయ్యాయి. మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వ్యక్తుల చిత్రాలతో కూడా ఈ కంపెనీ బీర్ టిన్లు విక్రయించినట్లు తెలుస్తోంది.
భారతదేశంలో గాంధీ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించబడినంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి బొమ్మను మద్యం ఉత్పత్తులపై ఉపయోగించడం అనైతికమని ప్రజలు భావిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అమెరికాలో ఓ కంపెనీ గాంధీ బొమ్మను బీర్ బాటిల్‌పై ముద్రించగా, వ్యతిరేకతతో వెంటనే క్షమాపణలు చెప్పి నిలిపివేసింది. ఇప్పుడు రష్యాలో ఇదే పరిస్థితి తలెత్తింది.
భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి రష్యా అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటుందా అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.