Ajit Pawar

Ajit Pawar: మహారాష్ట్రలో ఎయిర్ క్రాష్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ajit Pawar:  మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం నెలకొంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధ్రువీకరించింది.

ముంబైలో జరిగిన క్యాబినెట్ సమావేశం ముగించుకుని, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ తన బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కావడానికి సిద్ధమైంది. అయితే, సరిగ్గా ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కూలిపోయింది. కుప్పకూలిన వెంటనే విమానం నుంచి మంటలు చెలరేగగా, తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక వ్యక్తిగత కార్యదర్శి (PA) , మరో సిబ్బంది అక్కడికక్కడే మరణించారు.

అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. తన బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, బారామతి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అజిత్ పవార్ మరణవార్త వినగానే మహారాష్ట్ర మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. రాజకీయ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బారామతికి చేరుకుంటున్నారు. విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *