Mahammad Ali Shabbir: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కలిసిపోయిన కాంగ్రెస్, ఎంఐఎం పొత్తుకు విఘాతం కలిగేలా పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఎంఐఎంకు పడని నేత అయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, క్రికెటర్ మమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎంఐఎం పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. ఇదే దశలో కాంగ్రెస్ మరో కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంఐఎం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో విభేదాలు పొడచూపే అవకాశం ఏర్పడింది.
Mahammad Ali Shabbir: తొలుత కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఎప్పుడైతే అజారుద్దీన్‌ను కాంగ్రెస్ మంత్రిగా ప్రకటించిందో.. ఆ వెంటనే బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య రాష్ట్రంలో విభేదాలు పొడచూపాయని అందరూ భావిస్తుండగా, షబ్బీర్ అలీ మరో బాంబు పేల్చారు.
Mahammad Ali Shabbir: బీహార్ ఎన్నికల్లో బీజేపీకి బీటీంగా ఎంఐఎం పనిచేస్తుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో పోటీ చేసి సెక్యులర్ ఓట్లను చీల్చి బీజేపీకి ఎంఐఎం సహాయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈసారి ఎంఐఎం పార్టీకి కనీస డిపాజిట్లు కూడా రావని షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

