Mahaa Vamsi: తెలంగాణలో మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కార్యాలయంపై జరిగిన దాడిని మహాన్యూస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మారెళ్ల వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ తరహా దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
మారెళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని తక్షణమే అరికట్టాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తమ మహాన్యూస్ కార్యాలయంపై కూడా ఇదే తరహా దాడి జరిగిందని, అప్పుడు కూడా ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని ఆయన గుర్తు చేశారు.
మీడియా సంస్థలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి కానీ, భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని ఆయన అన్నారు. అటువంటి భౌతిక దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్
ఇలాంటి దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కావని ఆయన నొక్కి చెప్పారు. మీడియా సంస్థలపై దాడులు భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని, అటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని ఆయన సూచించారు.
కొంతకాలం క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపైనా దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతల లోపాలను చూపుతున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీడియా సంస్థలకు పూర్తి రక్షణ కల్పించి, అవి స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

