Vizag Greater Success: గ్రేటర్ విశాఖలో వైసీపీకి ఊహించని దెబ్బ! మేయర్‌పై అవిశ్వాసం సక్సెస్ కావడంతో కూటమి సంబరాలు చేసుకుంటోంది. 27 మంది కార్పొరేటర్లు వైసీపీ విప్‌ని ధిక్కరిస్తే, మరో 25 మంది వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం ఆ పార్టీ బలహీనతను బయటపెడుతోంది. అంతిమంగా వ్యూహాత్మకంగా కూటమి.. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ విప్ ధిక్కరణపై వైసీపీ న్యాయపోరాటం చేస్తే మాత్రం ఈ డ్రామా మరింత రసవత్తరంగా మారనుంది. మరి విశాఖ గ్రేటర్ రాజకీయంలో తదుపరి ట్విస్ట్ ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూటమి పార్టీలు జెండా ఎగురవేశాయి. శనివారం జరిగిన అవిశ్వాస ఓటింగ్‌లో వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఓడిపోయారు. మొత్తం 98 మంది కార్పొరేటర్లలో 97 మంది ఓటింగ్‌కు అర్హులు కాగా, ఎక్స్ అఫీషియో మెంబర్స్‌తో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరై, అందరూ అవిశ్వాసానికి మద్దతిచ్చారు. కలెక్టర్ హరీందర్‌కుమార్ ఓటింగ్ నిర్వహించి, మేయర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జీవీఎంసీ కూటమి చేతికి వచ్చింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మిద్దాం: చిరంజీవి
ఆది నుంచి కూడా కూటమికి అనుకూలంగా కార్పొరేటర్లను తమవైపుకు తిప్పుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో టీడీపీ, జనసేన నాయకులు ఈ విషయంలో చక్రం తిప్పారు. ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి.. కట్టుతప్పకుండా చూసుకున్నారు. వైసీపీ నుంచి వచ్చే వారికి ఆహ్వానం పలికారు. ఫలితంగా.. 58 మంది కార్పొరేటర్లతో కళకళలాడిన విశాఖ వైసీపీ బలం.. చివరకు 25కు పడిపోయింది. అవిశ్వాసంలో కూటమి నెగ్గడం లాంఛనమే అని గ్రహించిన వైసీపీ 25 మంది కార్పొరేటర్లు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఇక ఏకంగా 27 మంది కార్పొరేటర్లు వైసీపీ ఇచ్చిన విప్‌ని ధిక్కరించి కూటమికి అనుకూలంగా ఓటు వేశారు.
విశాఖలో అభివృద్ధి, పరిశ్రమలకు భూ కేటాయింపులకు జీవీఎంసీ అనుమతి కీలకం. వైసీపీ మేయర్ కూటమి కార్యక్రమాలకు అడ్డుపడటంతో అవిశ్వాసం పెట్టవలసి వచ్చింది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూడా ఈ పది నెలలైనా తమ వార్డుల్లో పనులు చేసుకుందామని కూటమి వైపు మొగ్గు చూపారు. ఇక చేసేది లేక చేతులెత్తేసిన వైసీపీ.. ఒక బీసీ మహిళని మేయర్ పీఠం నుండి దింపేశారని ఆరోపిస్తూ.. బీసీ కార్డు ముందుపెట్టి కుల రాజకీయం అయినా చేసుకుందామని ప్రయత్నిస్తోంది. మరోవైపు విప్ ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ చెబుతున్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లు మాత్రం ఈ విజయాన్ని వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కుకున్న నగరాభివృద్ధికి విముక్తిగా అభివర్ణించారు. విప్ ధిక్కరణపై చర్యలు తీసుకుంటే, కార్పొరేటర్ల సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నప్పటికీ, పదవీకాలం మరో 10 నెలలే కావడంతో అధికారులు ఆలస్యం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సో.. వైసీపీ ఏం చేసినా ఫలితం గుండు సున్నా అనమాట.
