YSR Kadapa District

YSR Kadapa District: చరిత్రనే చెరిపేయాలని చూసిన వైసీపీ..!

YSR Kadapa District: ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ పొలిటికల్ ఎజెండాకు తగినట్లుగా పేర్లు మార్చటం రివాజే. అయితే ఈ పేర్ల మార్పు అంశం తరచూ వివాదంగా మారటం.. ప్రజల మనోభావాలు దెబ్బతినడం ఎప్పుడూ జరిగేదే. ప్రజల భావోద్వేగాలకు భిన్నంగా తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుందన్న మాట కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం.

ఏపీలో ఒకప్పుడు కడప జిల్లా అనేది ఒకటి ఉండేదని మీకు తెలుసా? అని ఎవరైనా అడిగిచూడండి. మిమ్మల్ని వింతగా చూస్తారు. కానీ వాస్తవానికి ఇప్పుడు కడప అనే జిల్లా లేనే లేదు. దాని ప్లేస్‌లో వైఎస్ఆర్ అనే జిల్లా మాత్రం ఉంది. జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్ అనే మార్చే క్రమంలో.. ముందుగా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టినట్టున్నారు. ఆ క్రమంలో కడప అనే పేరు పూర్తిగా చెరిపేశారు. కడపని ఆ దేవదేవుడు కొలువున్న తిరుమల తిరుపతికి తొలి గడపగా పురాణాల్లో అభివర్ణించారు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్నా సరే జగన్‌ పట్టించుకోలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టినా.. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగానే పెట్టారు. కానీ కడపకు వచ్చే సరికి కనీసం వైఎస్ఆర్ కడప అని కూడా కాకుండా.. ఇక ఇది వైఎస్ఆర్ జిల్లా మాత్రమే అని శాసనం చేసేశారు. అధికారిక ఉత్తర్వులు వైఎస్ఆర్ జిల్లా పేరుతో వచ్చేవి. కానీ ప్రజలు మాత్రం కడప జిల్లాగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కడప జిల్లా అనే మాట్లాడుకుంటున్నారు. కడపోళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ జిల్లా వాళ్లం అని చెప్పుకునేవారు బహు అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే కడప అనే పదం ప్రజల్లో ఓ ఎమోషన్.

ఇది కూడా చదవండి: Sunita Williams: సునీత విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు ఎంత ఇచ్చారో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!

కూటమి ప్రభుత్వం రాగానే.. వైఎస్ఆర్ జిల్లాను కడప జిల్లాగా అధికారికంగా మార్చాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం ఆ మేరకు పేరు మార్చేందుకు కేబినెట్లో అనుమతి ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ పేరును పూర్తిగా తీసేయలేదు. వైఎస్ఆర్ పేరును అలాగే ఉంచి, వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చాలని నిర్ణయించుకుంది. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తూ.. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరి చేయటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో కూటమి సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం కొందరికి మాత్రమే సంతోషానికి గురి చేయగా.. తాజాగా కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం అందరి మనసుల్ని దోచుకునేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో పేర్ల విషయంలో ప్రభుత్వాలు సహజంగా చేసే తప్పుల్ని కూటమి సర్కారు అధిగమించిందన్న మాట వినిపిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *