Pulivendula: వై నాట్ పులివెందుల. మరికొద్ది రోజుల్లో ఈ నినాదం స్టేట్ వైడ్‌గా మార్మోగనుందా? అది కూడా పులివెందుల అడ్డా నుండే రీసౌండ్ ఇవ్వనుందా? మొన్న జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన జన సునామీ చూశారు… ఇక పులివెందుల గడ్డపై పసుపు సముద్రం పోటెత్తడం చూస్తారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ.
టీడీపీలో పసుపు పండుగ మహానాడుకు సమయం దగ్గర పడుతోంది. సమయం దగ్గర పడే కొద్దీ ఈ ఏడాది మహానాడుకు సంబంధించి కీలక విషయాలు రివీల్ అవుతన్నాయి. అందులో ఒకటి లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తుండటం కాగా, రెండోది మహానాడు వేధికగా పులివెందులను ఎంపిక చేయడం. ఈ దఫా మహానాడుకు కడప వేదికగా మారనుందని రెండు నెలల క్రితమే ప్రకటించారు టీడీపీ నేతలు. కడప హెడ్ క్వాటర్స్‌లో జరపాలని ముందుగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు వేదిక మారబోతోందని సమాచారం. అక్కడా ఇక్కడా ఎందుకు? టార్గెట్ వైనాట్ పులివెందుల అంటున్నారు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు.
45 సంవత్సరాల టీడీపీ చరిత్రలో కడపలో నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. ఇక పులివెందులలో నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి విక్టరీ అనేదే లేదు. అందుకే మహానాడు వేదిక కడప హెడ్ కోటర్స్ అని ముందుగా అనుకున్నా… పులివెందులకే షిఫ్ట్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇంటర్నల్‌గా ఇవే లీకులిస్తున్నారు టీడీపీ లీడర్లు. మొన్నటి వరకూ ఉమ్మడి కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి అడ్డాగా ఉండేది.
జిల్లాలో టీడీపీకి కార్యకర్తల బలం ఉన్నా.. సీట్లు ఉండేవి కావు. అటువంటి కంచుకోటని బద్ధలు కొట్టి ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు కైవసం చేసుకుంది కూటమి. వైసీపీ గెలుచ్చుకున్న మూడు నియోజకవర్గాల్లో బద్వేలు, రాజంపేటల్లో వైసీపీకి వచ్చింది బొటా బొటీ మెజార్టీలే. ఒక్క పులివెందులలోనే చెప్పుకోదగ్గ మెజార్టీ వచ్చింది. అక్కడ కూడా జగన్ మెజార్టీ 90 వేల నుండి 60 వేలకు పడిపోయింది. 1999 ఎన్నికల తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఈ స్థాయి విజయం దక్కించుకోవడం ఇదే తొలిసారి.
పులివెందులో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. గత ఐదేళ్లలో పులివెందుల వైసీపీలో అంతర్గతంగా చాలా మార్పులు వచ్చాయంటున్నారు. ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండరు. నియోజకర్గంలో ఆధిపత్యమంతా వైఎస్ అవినాశ్‌రెడ్డి వర్గానిదే. నియోజకవర్గ ప్రజల్లో జగన్ పట్ల సానుకూలత ఉన్నా… మిగతా యెడుగూరి సందింటి నేతలందిరిపైనా పూర్తి వ్యతిరేకత ఉంది. తల్లి, చెల్లి సపోర్టు కూడా జగన్‌కి లేదు. దీనికి తోడు వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి అరాచకాలను చూసిన పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే మార్పు చూస్తున్నారు.
గతంలో ఎంపీ అవినాశ్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నియోజవర్గంలోని అరటి, చీనీ రైతుల్ని పీక్కుతిన్న పరిస్థితుల్ని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వివేకా హత్య కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాస్కర్ రెడ్డి.. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుండి.. అసలు పులివెందులలోనే ఉండట్లేదట. దాంతో తమ జీవితంలో గత తొమ్మిది నెలలుగానే లాభాలు చూస్తున్నామంటూ అరటి, చీనీ రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో జగన్‌కి అంటూ ప్రత్యేకంగా ఎలాంటి కోటరీ ఉండదు. ఉన్న కోటరీ అంతా వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలదే. దీంతో ఇప్పటి నుండే పులివెందులపై ఫోకస్ చేస్తే జగన్‌ని ఓడించడం పెద్ద లెక్కే కాదని భావిస్తున్నారు స్థానిక టీడీపీ నాయకులు. అందుకే ఈ మహానాడు వేదికగా పులివెందులను సెలక్ట్ చేశారని టాక్ నడుస్తోంది.
ఇక మహానాడు వేదికగా.. పార్టీకి భవితవ్యాన్ని మరింత గట్టిగా తీర్చిదిద్దే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగానే.. నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్న నారా లోకేష్‌కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని క్రియేట్ చేసి ఇస్తారని.. పార్టీలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టీలో యువ తరానికి పెద్ద పీట వేసే అంశం కూడా ఈ మహానాడుతో సాకారం కాబోతోందని తెలుస్తోంది. పార్టీ భవితవ్యం.. 2047 వరకు అధికారంలో కొనసాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.