Operation Kagar: దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారా? ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల నుంచి నేపాల్ వరకు రెడ్‌కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్ ఇప్పుడు సేఫ్‌జోన్లు లేక సతమతమవుతున్నారా? మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయా..? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. రెండేళ్లుగా పోలీసులు ఉధృతం చేస్తున్న ఆపరేషన్లతో నక్సల్స్‌కు భారీఎత్తున ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో వరస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో భద్రత దళాల ఆపరేషన్ హిడ్మా లక్ష్యం నెరవేరుతుందా? వాచ్ దిస్ స్టోరీ..
నెల రోజులపాటు ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. కొద్ది రోజులుగా మూగబోయిన తుపాకుల మోత మళ్లీ మోగింది. దీంతో పచ్చని అడవులు ఎరుపెక్కాయి. దండకారణ్యంలోని బీజాపూర్‌లోని గంగలూరు, కాంకేర్ జిల్లాలోని అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు, ఒక డీఆర్జీ జవాను మృతిచెందారు. చనిపోయిన నక్సల్స్ నుంచి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గంగలూరు డీవీసీఎం సభ్యుడు ఎం.దినేశ్ పోలీసులకు లొంగిపోయిన వారంలోనే భారీ ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. బీజాపూర్ జిల్లా గంగలూరు సమీపంలోని బైలాదియ కొండకు అవతల దట్టమైన అడవుల్లో నక్సల్స్ సంచారం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బలగాలు… బుధవారం కూంబింగ్ ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి: Nagpur Violence: నాకు 15 నిమిషాలు ఇస్తే.. మేమంటే ఏంటో చూపిస్తాం..
ఈ సమయంలో మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో 26 మంది నక్సల్స్ మృతదేహాలను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో డీఆర్జీ జవాను రాజు మృతిచెందగా.. మరో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ‘‘చనిపోయిన నక్సల్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది’’ అని బస్తర్ ఐజీ వెల్లడించారు. మరో ఘటనలో.. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్‌మఢ్ అడవుల్లో కూంబింగ్‌లో ఉన్న భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఈ మార్గంలో పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతరను పేల్చడంతో.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారు కూడా ఉండి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.
మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఛత్తీస్ ఘడ్‌లో 30 మందిని చంపిన బలగాలు… మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కోసం భారీ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. మావోయిస్ట్ కమాండర్ హిడ్మా కోసమే 125కి పైగా గ్రామాలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 3 నెలల్లో 77 మంది నక్సల్స్ ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు.
ఈ దశలో భద్రత దళాలు హిడ్మా కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. హిడ్మాను వెతకడానికి 125కి పైగా గ్రామాల్లో సాంకేతిక మ్యాపింగ్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సరిహద్దుల్లో ఉన్న గ్రామాల థర్మల్ ఇమేజింగ్‌ను భద్రతా దళాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోనే హిడ్మా దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతాలలో నక్సలైట్ స్థావరాలు కూడా స్థాపించబడ్డాయని, భద్రతా దళాలు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్’ మావోయిస్టులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నదని.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ‘ఎక్స్’ వేదికగా ఈ ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశించి పోస్టు చేశారు. ‘మోదీ సర్కార్ మావోయిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా కఠినమైన చర్యలు తీసుకుంటోందని.. 2026, మార్చి 31వ తేదీ నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారుతుందని అమిత్ షా ఘాటైన పోస్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
