Kadapa Tammullu

Kadapa Tammullu: చంద్రబాబు డెడ్‌లైన్‌..వేటు ఎవరిపై అంటే..

Kadapa Tammullu: ఉమ్మడి కడప జిల్లా. ఇంచు మించు మూడు దశాబ్దాలుగా ఇక్కడ సైకిల్‌ పార్టీది పరాజయాల బాటే. ఖాతా తెరిస్తే చాలనుకునే పరిస్థితి. గత ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి పదింటిలో ఏడు చోట్ల కూటమి అభ్యర్థులకే జై కొట్టారు. ఇంతటి ఘన విజయాన్ని కట్టబెడితే.. ప్రజల సమస్యల్ని పక్కనబెట్టేసి.. ఆధిపత్యం కోసం, తమ ఇగోలు చల్లార్చుకోవడం కోసం తమ్ముళ్లు చేస్తున్న రచ్చ అస్సలు బాగోలేదట. ఎప్పటికప్పుడు అధిష్టానం హెచ్చరిస్తూనే ఉన్నా.. తమ్ముళ్లు దారికి రాకపోవడంతో.. అధినేత చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చేశారట. కడప తమ్ముళ్లూ… మారకపోతే వెళ్లిపోవచ్చని ఘాటుగానే తేల్చేశారట. హ్యావ్‌ ఎ లుక్‌.

ఉమ్మడి కడప జిల్లా నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పద్దతి మార్చుకోవాలని సీరియస్‌గానే హెచ్చరికలు చేశారు. గ్రూపులు పెడితే సహించేది లేదని ఖరఖండిగా తేల్చి చెప్పారు. ప్రజా సమస్యల పట్ల తమ్ముళ్ల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు… విభేదాలతో పార్టీ రచ్చకీడుస్తుండటంపై ఇటీవల ఒంటిమిట్ట పర్యటనలో ఘాటైన హెచ్చరికలు చేశారు.

తెలుగు తమ్ముళ్ల మధ్య అసమ్మతి, అసంతృప్తిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… కలిసి పనిచేయాల్సింది పోయి ఇలా విభేదాలతో విడిపోతారా అంటూ గట్టిగానే కోటింగ్‌ ఇచ్చారట. అంతే కాకుండా… ఇకనైనా పద్దతి మార్చుకోకుంటే పార్టీ నుండి నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చంటూ అల్టిమేటం జారీ చేశారట.

ఉమ్మడి కడప జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. అతి కీలకమైన మాజీ సీఎం జగన్‌ సొంత నియోజక వర్గంలోనే తమ్ముళ్ల మధ్య సఖ్యత లేకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల పులివెందుల టీడీపీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో.. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి స‌విత స‌మ‌క్షంలోనే… నియోజ‌కవ‌ర్గ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి వ‌ర్గీయులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకోవడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.

పులివెందుల టీడీపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయి… నిత్యం ఏదో ఒక విష‌య‌మై గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను సీఎం సీరియస్‌గా హెచ్చరించినట్లు వార్తలొస్తున్నాయి. బీటెక్‌ రవి, రాంగోపాల్‌రెడ్డి విభేదాలు మానేసి కలిసి పనిచేయాలనీ… వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదనీ, వేటు వేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండదనీ తీవ్రంగానే హెచ్చరించారట సీఎం చంద్రబాబు.

ఇది కూడా చదవండి: Telangana News: మాన‌వ‌త్వం చాటిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి కోడ‌లు.. విమానంలో వృద్ధుడి ప్రాణాల‌ను కాపాడిన డాక్ట‌ర్‌

ఇక రాజంపేట నియోజకవర్గంలో… ఒకవైపు రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌ రాజు, మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి పోడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వర్గాల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వేవ్‌లో కూడా సీటు గెలవని నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి కావడంతో.. చంద్రబాబు సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారట. పద్దతి మార్చుకోవాలని ఇరువర్గాలకు హెచ్చరికలు చేసిన చంద్రబాబు..

మరోసారి బజారుకెక్కితే పార్టీ నుండి బయటకు పంపడానికి కూడా వెనుకాడనని తేల్చి చెప్పారట. ఇక జనసేన అభ్యర్థి గెలుపొందిన రైల్వే కోడూరులోనూ టీడీపీ, జనసేనల మధ్య సమన్వయం కొరవడిన సంగతి బాబు దృష్టికొచ్చింది. ఇక్కడ నియోజకవర్గ టీడీపీ బాధ్యుడిగా రూపానందరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కూటమిలోకి చేరికలు ఊపందుకున్న వేళ… పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఉండట్లేదట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు… జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని, టీడీపీ క్యాడర్‌ కూడా అదే విధంగా ఎమ్మెల్యేకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.

ఇక ప్రొద్దుటూరు టీడీపీలో ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, యువ నేత ఉక్కు ప్ర‌వీణ్‌రెడ్డి మ‌ధ్య విభేదాలు తీవ్ర‌ స్థాయిలోనే ఉన్నాయంటున్నారు. ఇక బద్వేలులోనూ నేతల తీరు బాగోలేదని బాబు దృష్టికి వచ్చిందట. కూట‌మి సునామీలో కూడా బ‌ద్వేలులో గెలవ‌లేక‌పోవ‌డంపై బాబు అసంతృప్తిగా ఉన్నార‌ని స‌మాచారం. ప్రొద్దుటూరు, బద్వేలు… ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పనితీరు సరిచేసుకోవాలంటూ స్థానిక నేతలకు బాబు సున్నితంగా సూచించారట.

చరిత్రలో మొదటి సారి కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ మహానాడు జరపబోతోంది. ఈ సమయంలో కలిసి కట్టుగా పనిచేసి, ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన తమ్ముళ్లు.. ప్రజలిచ్చిన మ్యాంటేట్‌ని మరచి… అధికారం, ఆధిపత్యం కోసం గ్రూపులు కట్టి, కుమ్ములాటల్లో బిజీ అయిపోయారన్న విమర్శలు బాగా వస్తున్నాయ్‌. ఈ నేపథ్యంలో సీరియస్‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు… మహానాడు నిర్వహించే నాటికి… తమ్ముళ్లలో పూర్తి మార్పు కనిపించాలని ఆదేశించారట. చూడాలి మరి, అధినేత ఆదేశాలతో అయినా తమ్ముళ్లు దారికొస్తారో.. లేక అధిష్టానమే కొరఢా ఝలిపించాల్సిన పరిస్థితి వస్తుందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *