Balineni Vs Buchepalli

Balineni Vs Buchepalli: బూచేపల్లి రాజకీయ అంతం బాలినేని పంతమా? |

Balineni Vs Buchepalli: నాకో అవకాశమివ్వండి ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తానంటున్నారు మాజీ మంత్రి, జనసేన లీడర్‌ బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. దమ్ముంటే టచ్‌ చెయ్‌.. నీ వేషాలు కావాలంటే సినిమాల్లో ట్రై చేస్తో.. ఈ జిల్లా రాజకీయాల్లో కాదంటున్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి. రాజకీయాల్లో నీకు గురువులాంటి బాలినేనిపైనే అవాకులు, చెవాకులు పేలతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీలో కొనసాగుతున్న బాలినేని వర్గం. ఈ ఇరువురి మధ్య వైరం ఎక్కడికి దారి తీయనుంది? బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న వైసీపీలో ఉన్న బాలినేని వర్గం మొత్తం ఇప్పుడా పార్టీని వీడేందుకు రెడీ అవుతోందా? త్వరలోనే బాలినేని వర్గం మొత్తం జనసేనలో చేరబోతోందా? ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారబోతోందా? లెట్స్‌ వాచ్‌ ద స్టోరీ..

మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో మాజీ మంత్రి, ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే. జగన్‌ తన ఆస్తులు కాజేశాడన్న బాలినేని వ్యాఖ్యలతో వైసీపీ క్యాడర్‌ అగ్గిమీద గుగ్గిలంలా ఉడికిపోయింది. ఇక ప్రకాశం జిల్లా వైసీపీలోనూ బాలినేని వ్యాఖ్యల దుమారం అంతా ఇంతా కాదు. తనకి ఒక్క చాన్స్‌ ఇస్తే జిల్లాలో జెడ్పీ చైర్మన్‌నే మార్చేస్తానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భగ్గుమంది ప్రకాశం జిల్లా రాజకీయం. బాలినేని వ్యాఖ్యలకు ప్రకాశం జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న తల్లీ కొడుకులు ఇద్దరూ ఉలిక్కి పడ్డట్లైంది. 

ఇక ఊరుకుంటే జిల్లాలో ఇజ్జత్‌ ఉండదని భావించిన బూచేపల్లి కుటుంబం బాలినేనికి ఇవ్వాల్సిన డోస్‌ కన్నా కాస్తంత ఎక్కువే ఇచ్చేసింది. బాలినేని వ్యాఖ్యల తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టిన ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ… దమ్ముంటే తన కుర్చీపై చేయి వేయాలని.. అంతు చూస్తానని బాలినేనికి సవాల్‌ చేసేశారు. జగన్‌ను విమర్శించే స్థాయి బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదనీ, రాజశేఖర్ రెడ్డి కుటుంబం బిక్ష వల్లే బాలినేని రాజకీయాల్లో ఎదిగాడంటూ మండిపడ్డారామె.

బూచేపల్లి కుటుంబాన్ని రాజకీయంగా తొక్కలాని బాలినేని అనేక కుట్రలు చేశాడనీ, వైసీపీలో పదవులు ఇప్పిస్తానని నాయకుల వద్ద బాలినేని డబ్బులు గుంజారనీ ఆరోపించారు. ఇంకో ఏడాది వరకు తానే జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉంటాననీ, తన కుర్చీ ఎలా లాగేస్తావో నేనూ చూస్తానని బాలినేనికి స్ట్రయిట్‌ కౌంటర్‌ ఇచ్చారు బూచేపల్లి వెంకాయమ్మ.

ఇక వెంకాయమ్మ కొడుకు, ప్రకాశం జిల్లా వైసిపి అద్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం ఘాటుగానే ఇచ్చిపడేశారు. బాలినేని ఎక్కడుంటే ఆ పార్టీ నాశనమైపోతుందన్నారు.

ALSO READ  Chandrababu Vs Jagan: జగన్ పబ్లిసిటీ పీక్..బాబు టీమ్ వీక్.. :

పవన్‌ కన్నా బాలినేనే పెద్ద నటుడని… పొలిటికల్‌ కమలహాసన్ లాంటోడనీ కౌంటర్‌ పేల్చారు. టీడీపీ రిజెక్ట్ చేస్తే జనసేనలోకి వెళ్లిన బాలినేని జగన్‌ని విమర్శించే స్థాయిలేదని విరుచుకుపడ్డారు. జగన్ తన డబ్బులు కొట్టేశాడని బాలినేని అంటున్నారనీ, అసలు వైసీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేల నుంచి దోచుకున్నది బాలినేనే అని ఆరోపించారు. అసలు బాలినేని పార్టీ వీడటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఊపిరి పీల్చుకుందని ఎద్దేవా చేశారు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి.

ఇది కూడా చదవండి: Ahmedabad: తాళం వేసి ఉన్న ఇల్లు.. అప్పుడప్పుడు హడావుడి.. పోలీసులు ఓపెన్ చేసి చూసి షాక్!

బాలినేని వ్యాఖ్యలపై ఓపు జిల్లా వైసీపీ శ్రేణులు మండిపడుతుంటే.. రాజకీయాల్లో తనకు గురువులాంటి బాలినేనిపైనే.. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అవాకులు, చవాకులు పేలడాన్ని వైసీపీలో ఉన్న బాలినేని వర్గం జీర్ణించుకోలేకపోతోందట. గతంలో బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డికి రాజకీయాల్లో గురువుగా వ్యవహరించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. శివప్రసాద్‌రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.

అప్పట్లో టీడీపీ తరుపున నారపురెడ్డి శ్రీరాములు, కాంగ్రెస్‌ నుండి పిచ్చిరెడ్డి దర్శిలో పోటీ పడ్డారు. ఆ ట్రయాంగిల్‌ ఫైట్‌లో ఇండిపెండెంట్‌గా గెలుపొందారు బూచేపల్లి సుబ్బారెడ్డి. ఆ తర్వాత సుబ్బారెడ్డిని గుర్తించి, వైఎస్సార్‌కి పరిచయం చేసింది బాలినేని శ్రీనివాస్‌రెడ్డే అని చెప్తారు. ఆ రకంగా బూచేపల్లి కుటుంబాన్ని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చింది, వైఎస్‌ ఫ్యామిలీకి దగ్గర చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డేనట. ఆ తర్వాత కూడా బూచేపల్లి కుటుంబానికి మొన్న పార్టీ మారేదాకా బాలినేని శ్రీనివాసుల రెడ్డే రాజకీయంగా అండదండలుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు వైసీపీలోని బాలినేని వర్గీయులు.

గురుశిష్యుల మధ్య వార్‌తో ప్రకాశం జిల్లా రాజకీయం మలుపు తిరగబోతోంది అంటున్నారు పరిశీలకులు. బాలినేనిపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలతో వైసీపీలోని బాలినేని వర్గం మొత్తం బూచేపల్లి కుటుంబంపై పూర్తి వ్యతిరేకతతో ఉందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే వారంతా జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి. బూచేపల్లి, బాలినేని మధ్య మొదలైన వార్‌లో ఎవరు బలపడనున్నారు? ఎవరు బలహీనపడనున్నారు? అన్నది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *