Nagababu: ప్రస్తుతం జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబుకు రాజయోగం నడుస్తున్నట్లుంది. ఆయన ఓ ట్వీట్ చేసినా, ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చినా క్షణాల్లో సంచలనంగా మారుతూ ఉంటుంది. నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం కూడా అదే కోవలోకి వస్తుంది. అలా జనసేనలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నాగబాబు. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు.. త్వరలో ఓ అరుదైన ఫీట్ సాధించబోతున్నారు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
జనసేన ఆవిర్భావ సభ అనగానే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలాగో హైలెట్‌గా నిలుస్తుంది. కానీ నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత బాగా పేలిన స్పీచ్ నాగబాబుదే. పిఠాపురం టీడీపీ నేత వర్మ టార్గెట్‌గానే నాగబాబు ఆ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. కూటమిలో, ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అని నాగబాబును పలువురు తప్పు పడుతున్నారు కానీ.. అన్ని లెక్కలు వేసుకుని, అన్నీ ఆలోచించుకున్నాకే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది వాస్తవం. కొద్దిరోజుల కిందట పిఠాపురం వర్మ పోస్ట్ చేసి, డిలీట్ చేసిన ట్వీట్ గుర్తుందా? ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తాను ప్రచారం చేస్తున్న వీడియోలను తన ట్వీట్‌కు జత చేసి.. కష్టపడి సాధించిన విజయానికే గౌరవం అంటూ ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చారు. వర్మ పెట్టిన వీడియోలు కానీ, తగిలించిన ట్యాగ్ కానీ.. పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదన్న అర్థం వచ్చేలా ఉండటంతో పెద్ద దుమారమే చెలరేగింది.
వెంటనే వర్మ తన ట్వీట్‌ని డిలీట్ చేసి, వివరణ కూడా ఇచ్చుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అనమాట. అప్పటి వర్మ ట్వీట్‌కు ఇప్పుడు నాగబాబు కౌంటర్ ఇచ్చారని భావించొచ్చు. పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న తనకి, ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ రాలేదన్న బాధ, ఆవేదనలో వర్మ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగని తనకి బాధ కలిగినప్పుడల్లా పవన్‌ని తానే భుజాలపై మోసి గెలిపించాననీ, పవన్ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడటం కూడా సమంజసం కాదన్నది వర్మ గుర్తుంచుకోవాలంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఇటువంటి లెక్కల్ని సరిచేయడంలో తాను దిట్ట అని నాగబాబు మరోసారి నిరూపించుకున్నారని విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP SSC Exams 2025: రేపటి నుంచి పదో తరగతి ఎగ్జామ్స్.. బస్సు ప్రయాణం ఫ్రీ..
తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు.. త్వరలోనే ఏపీ క్యాబినెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకుంటే.. కూటమి ప్రభుత్వంలో శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందుతారు. ఇప్పటివరకు శాసనమండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు చంద్రబాబు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలన్నది నాగబాబు ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కుదరలేదు. నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎన్నికల్లో కూటమి సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. కూటమి గెలుపునకు కృషి చేశారు.
దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ చేశారు సీఎం చంద్రబాబు. నాగబాబు మంత్రి అయితే మెగా కుటుంబం సరికొత్త రికార్డు సృష్టించినట్టే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబు మంత్రి పదవి చేపట్టనున్నారు. సినీ రంగం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పదవులు అందుకోవడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు పరిశీలకులు.