Congress

Congress: సిర్పూర్‌లో రచ్చకెక్కిన హస్తం నేతలు!

Congress: అధికారంలో ఉన్న పార్టీలో ఆధిపత్యం కోసం నేతలు పోటీ పడటం సహజం. కానీ ఆ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కడంతో హస్తం పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. అపోజిషన్‌లో ఉన్నవారు, పదవులపై కన్నేసిన వాళ్లు అంతా హస్తం చెంతకు చేరడంతో ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ హౌస్‌ ఫుల్ అయిపోయింది. దీంతో నేతల మధ్య కుస్తీ మొదలైంది. పవర్‌లో లేనప్పుడు కనీసం జెండా పట్టని వారు ఇప్పుడు పెత్తనం చెలాయిస్తూ, పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోకపోవడంతో వారు ఖంగుతింటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడి హస్తం పార్టీ లీడర్ల మధ్య ఏమిటా లొల్లి? వాచ్ దిస్ స్టోరీ..

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఎన్నికల తర్వాత ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో అసలు లొల్లి మొదలైంది. సిర్పూర్ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా గత పదేళ్లుగా రావి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప కారు దిగి హస్తం గూటికి చేరారు. వరుసకు మామా అల్లుళ్లు అయినప్పటికీ… కోనప్ప మరియు రావి శ్రీనివాస్‌లకు మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో పాత-కొత్త నేతలంతా కలిసి పని చేయాలని నిర్ణయించుకొని తొలుత ముందుకెళ్లారు. 

ఇంతలోనే ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్‌లో చేరడంతో సిర్పూర్ హస్తం పార్టీలో త్రిముఖ పోరు మొదలైంది. దీంతో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పీక్‌ లెవల్‌కు చేరాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన దండె విఠల్ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. కోనప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కూడా ఒక విధంగా ఎమ్మెల్సీ దండె విఠలే కారణమని చెప్తున్నారు. తన ఫాలోవర్స్ ఒత్తిడితో ఇకపై న్యూట్రల్‌గా ఉండాలని కోనేరు కోనప్ప నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు తనకే ఇస్తారంటూ ఎమ్మెల్సీ దండె విఠల్, అతని అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు రావి శ్రీనివాస్‌.

ALSO READ  Megastar: మెగాస్టార్ 157వ సినిమా: శరవేగంతో షూటింగ్.. ముస్సోరిలో రెండో షెడ్యూల్!

ఇది కూడా చదవండి: Rape Case: సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువ‌తికి మ‌ద్యం తాగించి కొన్నిరోజులుగా లైంగిక‌దాడి

దండె విఠల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన నేతృత్వంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులను వరుసగా కాంగ్రెస్‌లో చేర్చేసుకుంటున్నారు. అయితే తాము తిరస్కరించిన వారిని కూడా పార్టీలో చేర్చుకుంటూ, విఠల్ పార్టీని పక్కదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు రావి శ్రీనివాస్. ఇలా నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది పార్టీ పరిస్థితి. ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా ఫ్లెక్సీలో మరొకరి ఫొటోలు పెట్టకపోవడం, ఒకరు నిర్వహించే కార్యక్రమానికి మరో నేత రాకపోవడం, అభివృద్ధి పనులకు ముగ్గురు వేర్వేరుగా ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నా… జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క దృష్టికి ఈ వర్గపోరు అంశం చాలా సార్లు తీసుకెళ్లినా.. ఆమె పెద్దగా పట్టించుకోలేదట. ఇక సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నేతల మధ్య గొడవకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రి సీతక్కే కారణమని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట. అన్నీ తెలిసినా, పార్టీ నేతలు విభేదాలతో రోడ్డెక్కినా ఇంచార్జ్ మంత్రి సీతక్క మౌనంగా ఉండటం, అందరినీ సమన్వయం పరచకపోవడమేంటో అర్థం కావడం లేదంటున్నారు. ఈ నేతల మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడోనని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *