Mahaa Bhakthi Channel: దేవుని ఆశీస్సులతో మహా భక్తి ఛానల్ ప్రారంభించబోతున్నాం అని చెప్పారు మహా గ్రూప్ ఛైర్మన్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ (Vamsi Krishna Marella). మహా భక్తి ఛానల్ ప్రారంభ మహోత్సవానికి ఏర్పాట్లను ప్రారంభించడంలో భాగంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన పలు విషయాలను వెల్లడించారు. “మహా గ్రూప్ నుంచి మహా భక్తి ఛానల్ ఫిబ్రవరి 26వ తేదీన గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఇది దేవదేవుని సంకల్పంగా భావిస్తున్నాం. మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవం జరిగే రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఆరోజు మహా శివరాత్రి. మహాదేవుడు శివుడి కోసం ప్రత్యేకమైన రోజున మహాభక్తి ఛానల్ ప్రారంభం కాబోతుండడం ఒక విశేషం అయితే.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ముగింపు రోజు కూడా ఆరోజే. అంటే మహాశివుని ఆశీస్సులతో.. మహా కుంభమేళా ముగుస్తున్న వేళలో తెలుగునాట మహా భక్తి ఛానల్ ప్రజల ముందుకు రాబోతోంది. భావి తరాలకు సనాతన ధర్మ మహోన్నత విధానాలను నిరంతరం అందించడమే ధ్యేయంగా మహా భక్తి ఛానల్ తీసుకువస్తున్నాం” అంటూ వంశీకృష్ణ వివరించారు.
మహాభక్తి ఛానల్ ప్రారంభ మహోత్సవానికి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు ఈరోజు నుంచి మొదలు అయ్యాయి. వసంత పంచమి పర్వదిన సందర్భంగా మహాభక్తి ఛానల్ ప్రారంభ మహోత్సవం నిర్వహించనున్న నంబూరు దశావతార వేంకటేశ్వరుని ఆలయం పక్కనే ఉన్న ప్రదేశంలో అంకురార్పణ నిర్వహించారు మహా గ్రూప్ చైర్మన్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ.
Mahaa Bhakthi Channel: మహాన్యూస్ ఛానల్ తో ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం.. రాజకీయ విషయాలపై లోతైన నిష్పాక్షిక విశ్లేషణలు.. సామాజిక అంశాలపై ప్రత్యేక కథనాలు ఇస్తూ తెలుగునాట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నవిషయం అందరికీ తెలిసిందే. ఈ అఖండ ప్రజాదారణతో మహా మ్యాక్స్ పేరుతొ ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ అందుబాటులోకి తీసుకువచ్చింది మహాగ్రూప్. తనదైన శైలిలో ఎప్పటికప్పుడు వినోద వార్తా విశేషాలను అందిస్తూ.. వినోద కథనాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకర్షించి విజయవంతంగా నడుస్తోంది మహా మ్యాక్స్.
ఈ రెండు ఛానల్స్ ప్రేక్షకాదరణతో ఇప్పుడు సనాతన ధర్మ బాటలో.. మహాదేవుని ఆశీస్సులతో భక్తజనావళి కోసం మహా భక్తి ఛానల్ తీసుకువస్తోంది మహా గ్రూప్. మహా భక్తి ఛానల్ ఫిబ్రవరి 26వ తేదీన నంబూరు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అశేష భక్తజన సమక్షంలో.. అతిరధ మహారథులు ముఖ్య అతిథులుగా మహా వేడుకతో మహా భక్తి ఛానల్ ఆవిష్కృతం కాబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మహా భక్తి ఛానల్ ఆవిష్కరణ ఉత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన బోతున్నారు.

