Madhya pradesh:మీరు చూసింది నిజమే.. కానీ ఓ చిన్న పొరపాటు విపరీతాలకు దారితీసింది. ఆ ఇంటి యువతి చనిపోయిందని అంత్యక్రియలు చేశారు. దుఃఖభారంతో ఆ కుటుంబ సభ్యులు మునిగిపోయారు. ఆ యువతిని హత్య చేశారని ఆ కుటుంబ సభ్యుల పోలీసులకు ఇచ్చిన ఆరోపణలతో నలుగురు జైలు పాలయ్యారు. ఇప్పటికీ వారు జైలులోనే మగ్గుతున్నారు. ఇది జరిగి ఏడాదిన్నర అయింది. ట్విస్ట్ ఏమిటంటే.. అదే మహిళ ఇంటికి వచ్చేసింది. షాక్ కావడం ఆ కుటుంబ సభ్యుల వంతయింది. ఇంత విపరిణామాలకు దారితీసిన ఆ ఘటన వివరాలేంటో తెలుసుకుందాం రండి.
Madhya pradesh:మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్సర్ జిల్లాకు చెందిన లలితా బాయి ఓ రోజు కనిపించకుండా పోయింది. గాబారా పడిన ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. దీంతో ఆమె తండ్రి రమేశ్ బాంచాడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అనుమానితులపై కేసు నమోదు చేసి నలుగురికి రిమాండ్ విధించారు. అదే సమయంలో అక్కడి ఆసుపత్రిలోని ఓ మార్చురీలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. వెంటనే రమేశ్ బాంచాడా దంపతులను పోలీసులు పిలిపించారు.
Madhya pradesh:ఆ ఆసుపత్రిలోని గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆనవాళ్లను రమేశ్ బాంచాడాకు చూపించారు. అయితే ముఖం గుర్తించ వీలు లేకపోవడంతో ఆమె శరీరంపై ఓ టాటూ ఉన్నది. ఆ టాటూ తమ కూతురుదేనని రమేశ్ బాంచాడా దంపతులు గుర్తించారు. దీంతో ఆ మృతదేహాన్ని వారు తమ ఇంటికి తీసుకెళ్లారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం ఆమెకు అంతిమ సంస్కారం నిర్వహించారు.
Madhya pradesh:ఇది జరిగిన 18 నెలలు అవుతుంది. హఠాత్తుగా ఓ రోజు లలితా బాయి తన ఇంటికి చేరుకున్నది. ఆ కుటుంబం షాక్‌కు గురైంది. చనిపోయిన తమ కూతురు ఎలా ప్రత్యక్షమైంది అన్న సంశయం వారిలో నెలకొన్నది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఎంట్రీ అయ్యారు. లలితా బాయిని ప్రశ్నించడంతో చావు కబురు చల్లగా చెప్పేసింది.
Madhya pradesh:ఓ రోజు తనను ఓ వ్యక్తి మోసం చేసి రూ.5 లక్షలకు అమ్మేశాడు. ఇన్ని రోజులు ఆ కొన్న వ్యక్తి వద్ద బందీగా ఉన్నా. బయటకు వెళ్లే అవకాశమే రాలేదు. ఇప్పుడు ఆ చాన్స్ దొరకడంతో తప్పించుకొని వారి చెర నుంచి బయటకు వచ్చాను.. అని లలితాబాయి చెప్పింది. దీంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. ఈ పరిణామంతో చేయని హత్యకు ఓ నలుగురు వ్యక్తులు 18 నెలలుగా చేయని తప్పునకు జైలు శిక్షను అనుభవిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

