Hyderabad Metro: హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచిన మెట్రో రైలు నిర్వహణపై ఎల్ అండ్ టీ కీలక వ్యాఖ్యలు చేసింది. వరుస ఆర్థిక నష్టాల కారణంగా ఇకపై మెట్రోను నడపడం సాధ్యం కాదని, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చామని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తమ ఆర్థిక ఇబ్బందులను వివరించి, కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులు లేఖ రాశారు.
గత కొంతకాలంగా మెట్రో రైలుకు ఆశించిన స్థాయి ఆదాయం రాకపోవడం, టికెట్ వసూళ్లు రోజువారీ ఖర్చులకు కూడా సరిపోకపోవడం, అలాగే పేరుకుపోయిన బకాయిలతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మెట్రో నిర్వహణ తమకు మరింత భారమైందని ఎల్ అండ్ టీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Actress: రెండో పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?
అందుకే మెట్రో నిర్వహణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నిర్ణయించినట్లు సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికిల్ (SPV) ఏర్పాటు చేసి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది.
ఎల్ అండ్ టీ ఈ ప్రకటనతో భాగ్యనగర మెట్రో భవిష్యత్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఒకప్పుడు నగర అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్థిక సవాళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి మరో పెద్ద పరీక్షగా మారింది.