Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం, వాయవ్య బంగాళాఖాతంలో, పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది.
ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.
మరో అల్పపీడనం:
ఇదిలా ఉండగా, ఎల్లుండి (మంగళవారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం కూడా రాష్ట్రంపై ప్రభావం చూపనుందని, దీనివల్ల మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
