Crime News: గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువజంట బలవన్మరణం చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి, తెనాలి మండలం అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రియాంక ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు వీరి మధ్య ప్రేమ మొలకెత్తి, గత కొంతకాలంగా పరస్పర అనుబంధం కొనసాగింది.
ఇది కూడా చదవండి: Movie Piracy: పైరసీ మాఫియా: దేశంలోనే అతిపెద్ద ముఠాను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు!
ఈ నెల 5వ తేదీన పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్న ఈ జంట పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిపించి మాట్లాడినప్పటికీ, కుటుంబాలు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో గోపి, ప్రియాంక తీవ్ర ఆత్మవేదనకు గురయ్యారు.
దీంతో గోపి, రెండు రోజుల క్రితం పేరేచర్ల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియాంక, ఈ సమాచారం తెలుసుకున్న మరుసటి రోజు అదే ప్రదేశంలో రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడింది.
రైల్వే పోలీసులు ఇద్దరి మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.