శివుడికి అత్యంత ఇష్టమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతున్న మహా భక్తి ఛానెల్ శక్తిగా మారాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా భక్తి టీవీ సాంగ్ ను ఆవిష్కరించారు. ఉపనిషత్తుల సారాంశాన్ని తెలిపే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజున మహా భక్తి ఛానెల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారికి భక్తి పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారిని ఇక్కడ ఇలా కలుసుకోవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన మారింది. శివుడిపై భక్తి పెరిగింది. రాముడిలానే కాదు.. అప్పుడప్పుడు శివుడిలా మారాలి. శివుడి గురించి తెలుసుకొని నేను ఎన్నో విషయాలు ఫాలో అవుతున్నాను. నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూమ్ లో కూడా శివుడి విగ్రహం ఉంటుంది. ప్రతి రోజూ శివుడ్ని పూజిస్తాను. శివుడ్ని తలచుకున్నా, అయన విగ్రహాన్ని చూసినా నాకు ధైర్యం వస్తుంది. నేను యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నడవలేడు అంటూ అనేక విమర్శలు చేశారు. నేను శివ భక్తుడిని…226 రోజులు..3,132 కిలోమీటర్లు నన్ను శివుడే నడిపించాడు. సత్యం..శివం..సుందరం. శుభాలను ఇచ్చేవాడు ..శివుడు. అందరికీ సంతోషాన్ని పంచేవాడు శివుడు. మానవత్వం…శివతత్వం. విషాన్ని మింగి అందరికీ అమృతం పంచిన ఆది దేవుడు శివుడు. ధ్యానం..మౌనం..జ్ఞానం..తప్ప వేరే అలంకారాలు వుండవు. భక్తి తప్ప మరే కానుకలు అక్కరలేదు. కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు. అర్ధ నారీశ్వరుడు రూపంలో మహిళల గొప్పతనం, మహిళల్ని గౌరవించాలని మనకు నేర్పింది శివుడని అన్నారు. ఒక సామాన్య జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి.. నేడు మహా గ్రూప్ ఛానెళ్లకు మేనేజింగ్ డైరెక్టరుగా ఎదిగిన మారెళ్ల వంశీకృష్ణ గారిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మహా కుంభమేళా ఆఖరి రోజున, మహా శివరాత్రి పర్వదినాన మొదలైన మహా భక్తి ఛానెల్ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేయాలన్నారు. ఛానెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
