Lokesh

Lokesh: రాజమండ్రిలో కొత్త భవనాల ప్రారంభం.. ఐటీ ఉద్యోగాలపై లోకేష్ ఫోకస్

Lokesh: రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా కొత్త భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  విమర్శలు చేశారు. ఐటీ రంగంలో పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలపై, ఇటీవల రహేజా ఐటీ పార్క్‌పైనా పిటిషన్లు వేయడం వెనుక యువత భవిష్యత్తుపై ద్వేషమే కారణమా అని ప్రశ్నించారు. ఐటీ ప్రాజెక్టులు వస్తే లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

యువతను ఉద్దేశించి మంత్రి లోకేష్ భావోద్వేగంగా మాట్లాడారు. చిన్న సమస్యలకే ఆత్మహత్యల వైపు వెళ్లవద్దని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలించినా దానిని సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. “అమ్మకు చెప్పలేని పని మనం చేయకూడదు” అన్నది తన జీవితానికి మార్గదర్శక సూత్రమని తెలిపారు.

Also Read: Harish Rao: మానవత్వం చాటుకున్న హరీష్ రావు.. పేద విద్యార్థిని పీజీ చదువు కోసం సొంత ఇల్లు తనఖా!

‘హలో లోకేష్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు. మహిళలను కించపరిచే మాటలు, ప్రవర్తన ఇళ్ల నుంచే ఆగాలని సూచించారు. సినిమాలు, సీరియల్స్‌, సోషల్ మీడియాలో మహిళలను తక్కువగా చూపించే అంశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందేశాన్ని ఇంట్లోనూ, స్నేహితుల మధ్యనూ చెప్పాలని విద్యార్థులను కోరారు.

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే రాజకీయాల్లో మంచి మార్పు సాధ్యమవుతుందని మంత్రి లోకేష్ అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్నానని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగానని చెప్పారు. క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.

ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల (ఆటానమస్)లో ప్రభుత్వం, దాతలు, కళాశాల నిధులతో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను మంత్రి ప్రారంభించారు. 172 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాలలో ప్రస్తుతం సుమారు 6,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలకు కార్పొరేట్ స్థాయిలో హంగులు తీసుకొచ్చేలా రూ.32 లక్షలతో కొత్త ముఖద్వారం, రూ.12 లక్షలతో ఇన్నర్ గేట్ నిర్మించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేషన్–ఇంక్యుబేషన్ హబ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన హన్‌సా సొల్యూషన్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా దీనికి సహకారం అందించింది. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో ఎంవోయూ కూడా కుదిరింది.

తదుపరి మంత్రి లోకేష్ రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. మొత్తం పర్యటనలో విద్య, యువత, అభివృద్ధే కేంద్రంగా మంత్రి లోకేష్ సందేశం స్పష్టంగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *