Lok Sabha Seats Increase

Lok Sabha Seats Increase: దేశ రాజకీయాల్లో భారీ మార్పు.. 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఇవే!

Lok Sabha Seats Increase: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా 50 శాతం మేర పెంచాలని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన ప్రజల సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించేందుకు, ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని సమాచారం.

ఈ ప్రతిపాదన గనుక అమలులోకి వస్తే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి ఏకంగా 6,185కి చేరుతాయి. ఈ మార్పుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బృందం ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది. ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ఇతర విపక్ష పార్టీలకు కూడా ఈ ప్రతిపాదన గురించి వివరించినట్లు తెలుస్తోంది. అందరి మద్దతుతో ఈ బిల్లును చట్టంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు 38కి, 175 అసెంబ్లీ స్థానాలు 263కు చేరుతాయి. అంతా అనుకున్నట్లు జరిగితే, 2029లో జరిగే సాధారణ ఎన్నికల నాటికే ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలైతే రాజకీయ పార్టీల వ్యూహాల్లోనూ, పాలనలోనూ పెను మార్పులు రావడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *