Local News: పోలీస్‌స్టేషన్లకు ఒక్కోసారి వింత పంచాయితీలు వస్తుంటాయి. అలాంటి వింతైన పంచాయితీ నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. ఓ కోడి కాళ్లు విరగ్గొట్టిన వ్యక్తిపై కేసు పెట్టాలని ఓ కుటుంబం ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇది వింతగా అనిపించినా, ఆ కోడి కాళ్లు విరగ్గొట్టిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని ఫిర్యాదుదారు పట్టుబడుతుండటం గమనార్హం.
Local News: నకిరేకల్ మండలం గొల్లగూడకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉన్నది. ఆ కోడి ప్రతిరోజూ ఆరుబయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఓ రోజు గంగమ్మ ఇంటిపక్కనే ఉన్న రాకేశ్ ఇంట్లోని గడ్డివాము గింజలు తినేది. అయితే తమ గడ్డివామును చెడగొడుతుందని రాకేశ్ కర్రతో కొట్టడంతో ఆ కోడి కాళ్లు విరిగిపోయాయి. ఇదీ అసలు విషయం.
Local News: తన కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్‌పై కేసు నమోదు చేయాలంటూ బోరున విలపిస్తూ గంగమ్మ నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోడి ఖరీదు చెప్పు.. ఎంతయితే అంత ఆ రాకేశ్‌తోనే డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు నచ్చజెప్పారు. అయినా గంగమ్మ ససేమిరా అన్నది. తనకు డబ్బులొద్దని, తన కళ్లముందే తన కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్‌పై కేసు పెట్టాలని, శిక్ష పడాల్సిందేనని పట్టుబట్టింది. నా కోడికి జరిగిన అన్యాయం మరో కోడికి జరగొద్దని కూడా భీష్మించుకున్నది.
Local News: పోలీసులు ఎంతగా చెప్పినా వినకపోవడంతో తామే స్వయంగా గ్రామానికి వచ్చి విచారిస్తామని, ముందుగా కోడికి వైద్యం చేయించమని చెప్పి గంగమ్మను స్టేషన్ నుంచి పంపించారు. అయితే ఆ పోలీసులకు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో తలలు పట్టుకున్నారు. గంగమ్మ వినిపించుకోకపోవడంతో.. గ్రామంలో పెద్ద మనుషులతో మాట్లాడి ఒప్పించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఆ గంగమ్మ ఒప్పుకుంటుందా? లేదా? అనేది నేడు తేలనున్నది.

