Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు వేగవంతంగా ప్రక్రియను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్కను అధికారులు తేల్చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యను కూడా నిర్ణయించారు.
Local Body Elections: ఈ మేరకు రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్యను 5,773గా నిర్ణయించారు. గతంకంటే 44 స్థానాలు తగ్గినట్టు అధికారులు తేల్చారు. అదే విధంగా 566 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలుగా నిర్ణయించారు. గతంలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు చేరింది. అదే విధంగా 12,760 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నదని తేల్చారు. వాటిల్లో 1,12,684 వార్డులు ఉన్నట్టు నిర్ధారించారు.
Local Body Elections: ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టమైన గణాంకాలను తాజాగా వెల్లడించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తొలిదశ కసరత్తు పూర్తయింది. ఆ తర్వాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఒక స్పష్టత వచ్చాక, పంచాయతీరాజ్ శాఖ వాటిని ఖరారు చేయనున్నది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించనున్నారు. వాటికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నది.

