Local Body Elections: సెప్టెంబర్ నెల 30లోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధానంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీని అమలు చేసిన తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా స్పష్టంచేశారు. ఆర్డినెన్స్ ద్వారానైనా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Local Body Elections: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే ఇప్పటికీ నెల దాటినా ఆ బిల్లులపై కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని నిర్ణియించడంతో ఆ తర్వాతే రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం పంపిన ప్రతిపాదనలను పట్టించుకోలేదని భావిస్తున్నారు.
Local Body Elections: ఈ దశలో ఆర్డినెన్స్ ద్వారానైనా ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఆ మేరకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన ఆ నిర్ణయంపై చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో త్వరలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనున్నది. వారంలోగా అసెంబ్లీని సమావేశ పరిచి ఆర్డినెన్స్ తేనున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
Local Body Elections: ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సర్కార్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ నెల (జూలై) 14న కొత్త రేషన్‌కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కార్డులను లబ్ధిదారులకు పంపిణీని చేపట్టనున్నారు. అనంతరం అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు.
Local Body Elections: ఆ తర్వాత తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటికే ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. వారందరికీ తొలి విడత బిల్లులను కూడా ఈలోగానే పంపిణీ చేసే అవకాశం ఉన్నది. గ్రూప్ 1పై హైకోర్టులో తుది తీర్పు వస్తే మాత్రం ఎంపికైన అభ్యర్థులకు కూడా ఉద్యోగ ఎంపిక పత్రాలను సీఎం చేతులమీదుగా అందజేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇక మిగతా అధికారిక కార్యక్రమాలను ఈ జూలై నెల మూడోవారంలోగా పూర్తిచేయాలని ఆదేశాలు కూడా వెళ్లాయి.
Local Body Elections: సర్కార్‌కు ఇక మిగిలింది రెండు నెలలే. జూలై నెలాఖరున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆగస్టులోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆగస్టులోనే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ ఎన్నికలను సెప్టెంబర్ నెలలో పూర్తిచేయనున్నట్టు సమాచారం. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలను పూర్తిచేయాలన్న సంకల్పంతో సర్కారు అడుగులు వేస్తున్నది.