Anakapalle

Anakapalle: లిక్కర్ షాపులు బంద్.. ఎక్సైజ్‌కి ఊహించని షాక్!

Anakapalle: అనకాపల్లిలో ఊహించని సమస్య లిక్కర్ వ్యాపారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో, ఒత్తిడిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లాలోని వైన్ షాపుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా షాపులు మూసేసి, తాళాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించి నిరసన తెలిపారు.

లిక్కర్ వ్యాపారం అంటే లాభాల పంట అని అంతా అనుకుంటారు. కానీ, అనకాపల్లి జిల్లాలోని వైన్ షాపుల యజమానులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భారీగా పెంచిన లైసెన్స్ ఫీజులతో పాటు, వ్యాపారులకు 20 శాతం మార్జిన్ (లాభం)పై ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదు. దీంతో, పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీలు కూడా రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

“పర్మిట్ రూమ్” గోల ఎక్కువైంది!
ఇటీవల, ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు, లిక్కర్ షాపులకు అనుబంధంగా ‘పర్మిట్ రూమ్’లు తెరవాలనే ఒత్తిడి ఎక్కువైందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికోసం అదనంగా ఏకంగా రూ. 7.5 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారట. ఈ భారం కూడా తమపై పడితే ఇక నష్టాలే తప్ప లాభాలు ఉండవని వ్యాపారుల ఆందోళన.

మూకుమ్మడి బంద్‌కి తీర్మానం:
పరిస్థితి చేయిదాటిపోవడంతో, జిల్లాలోని లిక్కర్ వ్యాపారులంతా సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పెరిగిన ఒత్తిళ్లను తట్టుకోలేక మూకుమ్మడిగా వైన్ షాపులను మూసి వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం చేసిన వెంటనే, తమ షాపుల్లోని సరుకును అలాగే వదిలేసి, షాపులకు తాళాలు వేసి.. ఆ తాళాలను అనకాపల్లిలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో అప్పగించి నిరసన తెలిపారు.

Also Read: Rain Alert: బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాలకు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్!

ఎక్సైజ్ అధికారులకు షాక్!
అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖజానాకు ఆదాయం తెచ్చిపెడుతున్న తమకు అన్యాయం జరుగుతోందని వారి వాదన. వ్యాపారుల ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి, మూసివేసిన షాపుల తాళాలను వ్యాపారులకే తిరిగి ఇచ్చేశారు.

శాశ్వతంగా మూసేస్తాం!
దీంతో, వ్యాపారులు ఓ డెడ్‌లైన్ విధించారు. “ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం. అప్పటికీ మా సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, శాశ్వతంగా షాపులు మూసివేస్తాం” అని వ్యాపారులు స్పష్టం చేశారు.

జిల్లాలో మొత్తం 136 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి వ్యాపార కాలం 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంది. ప్రతి ఏటా లైసెన్స్ ఫీజు కూడా 10 శాతం పెరుగుతున్న నేపథ్యంలో, వ్యాపారుల నిరసన ఎక్సైజ్ శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే, పర్మిట్ రూమ్ ల కోసం ఒత్తిళ్లు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని కొందరు అధికారులు చెబుతున్నా, ఈ వ్యవహారంపై స్పందించడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు.

మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? లిక్కర్ వ్యాపారుల సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్నది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *