TS Liquor Rates: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీరు ధరలను పెంచి మద్యం ప్రియులపై భారం మోపింది. ఇప్పుడు మరోసారి బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (IFML) మద్యం రకాల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలను పెంచే సూచనలతో నివేదికను సమర్పించినట్టు తెలిసింది.
చీప్ లిక్కర్ ధరలపై భారం
తెలంగాణలో ఇప్పటికే చీప్ లిక్కర్ ధరలు సామాన్య మద్యపాన ప్రియులకు భారమైపోతున్నాయి. ప్రస్తుతం 180 మిలీ లీటర్ల చీప్ లిక్కర్ క్వార్టర్ సీసా ధర రూ.110గా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రూ.20 వరకు పెరిగే సూచనలు ఉన్నాయని సమాచారం.
పొరుగు రాష్ట్రాలతో పోలిక
పొరుగు రాష్ట్రాల్లో చీప్ లిక్కర్ ధరలు తక్కువగా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం 90 మిలీ లీటర్ల టెట్రాప్యాక్‌ను రూ.45కి అందిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీదారు పేరుతో క్వార్టర్ సీసాను రూ.35కే అందుబాటులోకి తెచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ కింద క్వార్టర్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణలో కూడా ఎక్సైజ్ డ్యూటీని సవరించి ధరలను తగ్గించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల గుడుంబా ఉత్పత్తి, అక్రమ మద్యం విక్రయాలు, ఎన్డీపీఎల్ కేసులు తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Telangana assembly: మార్చి 1 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
20% వరకు ధరలు పెరిగే అవకాశం
ప్రభుత్వం అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలను పెంచే ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మద్యప్రియులు మరింత భారం అనుభవించాల్సి ఉంటుంది.

