Kaleshwaram Project: తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఐకి లేఖ రాసిన ప్రభుత్వం, ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, నిర్మాణ లోపాలపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. సీబీఐ కూడా లేఖ అందుకున్నట్లు అధికారిక అంగీకారం తెలిపింది.
సీబీఐకి స్పెషల్ పర్మిషన్
2022లో రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేకుండా తీసుకున్న ఉత్తర్వులకు ఈ కేసు మినహాయింపునిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
క్రమంగా పెరిగిన అనుమానాలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అనుమానాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలో ఆరు పిల్లర్లు కుంగిపోవడంతో పెద్ద ఎత్తున వివాదం రేగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం NDSA కమిటీని ఏర్పాటు చేయగా, ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతలో ఘోర లోపాలు ఉన్నట్టు తేల్చింది.
ఇది కూడా చదవండి: AAP MLA Arrested: బిగ్ బ్రేకింగ్.. పోలీసులపై కాల్పులు జరిపి.. ఆప్ ఎమ్మెల్యే పరార్!
పీసీ ఘోష్ కమిటీ తేల్చిన లోపాలు
దీనిని మరింతగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ఈ కమిటీ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన వైఫల్యాలు ఉన్నట్టు తేల్చి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ ఆమోదం, సీబీఐ దర్యాప్తు సిఫారసు
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి, సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు సీబీఐకి అధికారిక లేఖ పంపి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరింది.
ఖజానాకు భారీ నష్టం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని ప్రభుత్వ లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఈ పరిణామాలతో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.