YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారిని జగన్ 2.0లో మర్చిపోవడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా, పార్టీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఈ సమావేశంలో ఉన్నారు.
జగన్ మాట్లాడుతూ, ప్రస్తుతం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల వివరాలను డేటా బేస్ రూపంలో సమీకరించాలని, అందులో ఆధారాలు కూడిన సమాచారం ఉండాలని సూచించారు. “అందరూ గుర్తుంచబడతారు, ఎవ్వరూ మర్చిపోరు,” అని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ఓ ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ యాప్‌లో కార్యకర్తలు తమ సమస్యలు, అన్యాయాలు, ఆధారాలు నమోదు చేస్తే, వాటిని డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి, అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేస్తామని జగన్ చెప్పారు.
Also Read: Priyanka Gandhi Vadra: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల హక్కు
అన్యాయాలు చేస్తున్నవారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు జగన్. చట్టం తన పని తాను చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, బాధితుల తరపున లాయర్లు పోరాడుతున్న తీరును ప్రశంసించారు. ‘‘మీరు పోషిస్తున్న పాత్ర గర్వకారణం. మీరు లేకపోతే న్యాయం దొరకదు. ప్రతిపక్షంగా ఉన్న ఈ కష్టకాలంలో మీరు పార్టీకి పెద్దన్నల్లా నిలుస్తున్నారు,’’ అని అన్నారు. ప్రస్తుత చంద్రబాబు పాలనను ఉద్దేశించి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కలియుగమంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ 14 నెలల పాలన చూడండి. న్యాయం, ధర్మం కనిపించదు. ఎవరికైనా ఎదురు మాట్లాడితే చాలు – కేసులు, అరెస్టులు, బురద వేసే రాజకీయాలు,’’ అని ఆరోపించారు.
‘మేము అధికారంలో ఉన్నప్పుడు లా నేస్తం ద్వారా యువ లాయర్లకు అండగా నిలిచాం. జీపీలు, ఏజీపీ పోస్టుల్లో 52% రిజర్వేషన్ ఇచ్చాం. రూ.100 కోట్ల న్యాయవాదుల సంక్షేమ నిధిలో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. ఇన్సూరెన్స్ పథకంలో ప్రభుత్వమే 1/3 వంతు చెల్లించింది. ఇవన్నీ వైసీపీ పాలనలోనే సాధ్యమయ్యాయి,’’ అని తెలిపారు. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు బాధిచేస్తున్న అధికారులపై న్యాయబద్ధంగా చర్యలు తప్పవు.