Hyderabad : తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది వేణుగోపాల్ రావు గుండెపోటుకు గురై మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే, మంగళవారం నాడు వేణుగోపాల్ రావు హైకోర్టులో తన క్లయింట్ తరపున వాదనలు వినిపిస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యంలోనే మృతిచెందారు.
వేణుగోపాల్ రావు అకస్మిక మరణం న్యాయవర్గాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు సంతాపంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా అన్నిబెంచ్ల న్యాయమూర్తులు విచారణలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేగాక, హైకోర్టు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ విచారణలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
వేణుగోపాల్ రావు మృతిపట్ల న్యాయవాదుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. హైకోర్టు ప్రాంగణంలో ఆయన అంతిమయాత్ర నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.
సామాజిక మాధ్యమాల్లో స్పందనలు
వేణుగోపాల్ రావు మృతిపై పలువురు న్యాయవాదులు, ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “న్యాయరంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం” అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
ఈ విషాద ఘటన హైకోర్టు వాతావరణాన్ని మౌనంగా మార్చింది. వేణుగోపాల్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రార్థిస్తున్నారు.