K.lakshman: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం 

K. Lakshman: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీసీల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం యావత్ బీసీ సమాజం ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం ఉంచిందని లక్ష్మణ్ తెలిపారు. బీసీలకు నిజమైన న్యాయం చేయగలది కేవలం బీజేపీయే అని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 22 నెలల తర్వాత కాళేశ్వరం పై విచారణకు సీబీఐకి అప్పగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించడం ఆలస్యమైన కనువిప్పు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణం సీబీఐ దర్యాప్తుతోనే వెలుగులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. నిజాన్ని బయట పెట్టగల ఏకైక సంస్థ సీబీఐ మాత్రమేనని అన్నారు. రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించడం అవినీతికి నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు.

అలాగే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి, తెలంగాణ సంపదను దోచుకోవడానికి అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తన వైఖరిని మార్చుకున్నారని కామెంట్ చేశారు.

కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కారణంగానే జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, అది కేవలం కాలయాపన కోసం మాత్రమేనని లక్ష్మణ్ విమర్శించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా బట్టబయలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *