బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మూవీ ఆస్కార్ 2025 బరిలో నిలిచింది. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఈ మూవీని ఆస్కార్స్ 2025 పోటికీ పంపించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. యానిమల్, మలయాళం జాతీయ పురస్కార సినిమా అత్తామ్, కేనిస్ విజేత సినిమా ఆల్ వి ఇమాజిన్, తెలుగు సినిమాలు కల్కి 2989 ఎడి, హనుమాన్, ఆర్టికల్ 370, తమిళ సినిమా మహారాజా, స్వతంత్య్ర వీర్ సావర్కర్ వంటి పలు సినిమాల పరిశీలన తరవాతి ఆస్కార్‌కు భారత్ ఎంట్రీగా ఈ సినిమాను ఎంపిక చేశారని ఫిల్మ్ ఫెడరేషన్ వెల్లడించింది. హిందీ సినిమా శ్రీకాంత్ కూడా పోటి పడింది. లాపతా లేడీస్ సినిమాను కిరణ్ రావుకు చెందిన కిండ్గింగ్ ప్రొడక్షన్, అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ, జియో స్టూడియోస్ సంయుక్తంగా రూపొందించాయి.
చిత్ర నిర్మాతగా, రచయిత్రిగా ఇంతకాలం ఎక్కువగా పరిచయం అయిన కిరణ్‌రావు దాదాపుగా 13 సంవత్సరాల తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ సినిమాను రూపొందించారు. 97వ ఆస్కార్ అవార్డు పోటీలకు దేశం తరఫున తన సినిమా ఎంపిక అయినందుకు తాను గర్విస్తున్నానని, అంతకు మించి ఆనందంగా ఉందని కిరణ్‌రావు స్పందించారు. సరిహద్దులు, భాషలకు అతీతంగా ప్రజల హృదయాలను అనుసంధానం చేసే శక్తివంతమైన మీడియా సినిమా అని, నిర్మాణాత్మక అర్థవంతమైన ఆలోచనలకు సినిమా అత్యుత్తమ మార్గం అవుతుందని తెలిపారు. ఇండియాలో ఆదరణ పొందినట్లే అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాకు గుర్తింపు వస్తుందని విశ్వసిస్తున్నట్లు కిరణ్ రావు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో లాపతా లేడీస్ సినిమా విడుదల అయింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. గ్రామీణ భారతం, ప్రత్యేకించి రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాలో ఆడపడుచుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది.
2001 ప్రాంతంలో రాజస్థాన్‌లో ఓ రైలు ప్రయాణంలో నవవధువుల ఇద్దరు తారుమారయిన నిజమైన ఘటనను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను కిరణ్‌రావు తీశారు. మహిళా సాధికారికత, వారిలో ఉండే సహృదయత, హాస్యం వంటివి అనేకం ఈ సినిమాలో అందరిని పలు అనుభూతుల అంచులకు తీసుకువెళ్లుతాయి. 2002లో అమీర్ ఖాన్ సినిమా లగాన్ తరువాత ఇప్పుడు ఈ సినిమానే ఆస్కార్ బరికి ఎంపికయింది. అంతకు ముందు నర్గీస్ సినిమా మదర్ ఇండియా, సలాం బాంబే కూడా పోటీకి నిలిచాయి. గత ఏడాది మలయాళం సినిమా ఎవరీఒన్ ఈజ్ ఏ హీరో సినిమాను ఆస్కార్ పోటీకి ఎంపిక చేశారు.
