Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో (Kurnool Road Accident) సజీవ దహనమైన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్‌ఏ పరీక్షా నివేదికల ఆధారంగా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ అప్పగింత కార్యక్రమాన్ని చేపట్టారు. గత మూడు రోజులుగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న ఆరు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబాలకు ఈ పరిణామం ఎంతో ఊరటనిచ్చింది.
మొత్తం 19 మంది ఈ ప్రమాదంలో మరణించగా, 18 మృతదేహాల గుర్తింపు కోసం విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలు జరిగాయి. అధికారులు సేకరించిన రక్తం నమూనాలు (బ్లడ్ శాంపిల్స్), మృతదేహాల అవయవాల నమూనాలు సరిపోలడంతో గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ. సిరి ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా బాధిత కుటుంబాలకు అధికారులు అందజేశారు.
Also Read: Nara Lokesh: “బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరం”: ఫేక్ ప్రచారాలపై చర్యలకు మంత్రి లోకేశ్ ఆదేశం!
మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి చిత్తూరుకు చెందిన ఒక వ్యక్తి వచ్చారని, తమ తండ్రి కనిపించడం లేదని చెప్పారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆ మృతదేహం ఎవరిదనేది డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా త్వరలో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన డీఎన్‌ఏ ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరో మృతుడి బంధువులు ఎవరూ రాకపోవడంతో అధికారులు అంతిమ సంస్కారాలు (మట్టి కార్యక్రమం) నిర్వహించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. అయితే, ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన కర్నూలు నివాసి శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి బైక్ నడుపుతున్నట్లు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. మృతుడి అంతర్గత అవయవాల (విస్సెరా) నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నివేదిక ధృవీకరించింది.
డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం సేవించడం ఈ ఘోర ప్రమాదానికి దారితీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

