Kurnool Bus Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
రాత్రి 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి దాదాపు 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఘర్షణ వల్ల స్పార్క్‌లు పుట్టి బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోగా, డీజిల్ లీక్ అవ్వడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆ మంటలు ఏసీ బస్సులోపలికి చొరబడి ప్రయాణికులను బంధించాయి. అద్దాలు మూసివేసి ఉండటంతో పొగతో ఊపిరాడక, మంటల్లో కాలిపోయి చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన వారిలో బైకర్ శివశంకర్ కూడా
బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ (25)గా పోలీసులు గుర్తించారు. కర్నూలు నగరంలోని ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవాడు. డోన్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. రేపే అతనికి పెళ్లి చూపులు ఉండగా, ఇంతలో జరిగిన ప్రమాదంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రాత్రి 9.30కి కుటుంబంతో చివరిసారి మాట్లాడిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది.
మృతదేహాల గుర్తింపుకు డీఎన్‌ఏ పరీక్షలు
మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. అధికారులు డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి, తర్వాతే బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఆసుపత్రిలో చికిత్స, మంత్రి పరామర్శ
గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి సాంత్వన పలికారు.
పరిహారం ప్రకటనలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం.
- ప్రధాని నరేంద్ర మోదీ: మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల రూపాయలు ప్రకటించారు.
బస్సు ఫిట్‌నెస్‌పై అనుమానాలు
కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగినదని, ఫిట్‌నెస్ మరియు అనుమతులు అదే రాష్ట్ర పరిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

