Kunamneni sambha shiva: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శుద్ధమైన మనసుతో ముందుకు రాకపోతే సమస్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌కు ఎదురైన అనుభవమే ఇక్కడా ఎదురవుతుందని సూచించారు.
హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రజలకు స్పష్టత అవసరమని కూనంనేని పేర్కొన్నారు. అనేక హామీలు ఇచ్చినా, అవి అమలయ్యాయా లేదా అనే దానిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ను కోరారు. హామీల అమలు గురించి వివరణ ఇచ్చిన తర్వాతే ఎన్నికలలో పోటీ చేయాలని సూచించారు.p
ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కూనంనేని, మోదీ ఇప్పటికీ ఫ్యూడల్ వ్యవస్థలోనే ఉన్నారని అన్నారు. అక్షరాస్యత పెరిగితేనే దేశానికి నిజమైన పురోగతి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఉచితాలపై మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ కూనంనేని
ప్రధాని మోదీ ఉచితాల గురించి అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశం లో ఆర్థిక వ్యవస్థ ఎలా పని చేస్తుందో మోదీకి అర్థం కావడం లేదని అన్నారు. పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వాలకు వచ్చే రూ. 22 లక్షల కోట్లలో 90% పేదలు కడుతున్నారని, కానీ ఆ ధనాన్ని 10% ధనిక వర్గాల ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.
పేదలపై అధిక భారం – కార్పొరేట్లకు ప్రయోజనం
పేద ప్రజలు చెల్లించే జీఎస్టీతోనే ప్రభుత్వ బడ్జెట్ నడుస్తోందని, కానీ అదే లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపదలో 1% మంది 45% సంపదను ఆక్రమించుకున్నారని, మిగిలిన 99% ప్రజలు మిగిలిన 55% సంపదతో జీవితాన్ని గడిపే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తులపై వ్యాఖ్యలు
న్యాయమూర్తులు కూడా రాజకీయ నాయకుల మాదిరిగా ఉచితాలపై మాట్లాడుతున్నారని కూనంనేని సాంబశివ రావు విమర్శించారు. ఉచిత పథకాలను తప్పుబట్టడం అన్యాయం అని, నిజమైన సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనిఆయన సూచించారు.

