Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన ‘కుబేర’ సినిమా తమిళనాట ఆశించిన విజయం సాధించలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా సాగిన ఈ చిత్రం, రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో కొంత ఊపందుకుంది. తమిళ రివ్యూయర్లు ధనుష్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘కుబేర’ను ప్రశంసించారు. తొలిరోజు వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, వీకెండ్‌లో మాత్రం సాధారణ వసూళ్లతో సరిపెట్టుకుంది. వీకెండ్ తర్వాత వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రూ.20 కోట్ల మేర వసూళ్లు రాగా, ఫుల్ రన్‌లో రూ.25 కోట్లు దాటే అవకాశం కనిపించడం లేదు. తమిళంలో రూ.18 కోట్లకు హక్కులు అమ్మగా, 40-50% నష్టాలు తప్పవని అంచనా. ఈ నిరాశ పరిణామంపై శేఖర్ కమ్ముల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమిళ సెన్సిబిలిటీస్‌కు తగ్గ కథ, ధనుష్ పాత్ర ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించకపోవడం అర్థం కావడం లేదని, ఎక్కడ తప్పిదం జరిగిందో విశ్లేషిస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలుగులో భారీ విజయం సాధించిన ‘కుబేర’, తమిళంలో మాత్రం వెనుకబడటం ఆశ్చర్యకరం.

