KTR:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అయినట్టు నిన్నటి నుంచి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ గవర్నర్ అనుమతి కోరింది. ఈ మేరకు తాజాగా గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏ సమయంలోనైనా కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనూ ఒక హైప్ క్రియేట్ అయింది.
KTR:ఫార్ములా ఈ-కార్ రేసులో ఆయనను నిందితుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకూ వేచి ఉన్న ప్రభుత్వం ప్లాన్ ప్రకారం అరెస్టుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీలోనూ అలజడి నెలకొన్నది.
KTR:ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ కార్ రేసులో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరించిందని, నిబంధనల మేరకే తాను మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, అధికారులకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని ఉబలాటపడుతున్నదని, ఒకవేళ అరెస్టు చేసుకుంటే చేసుకోమని కేటీఆర్ ఆనాడే సవాల్ విసిరారు.
KTR:గత కొన్నాళ్లుగా ప్రభుత్వం కంటిలో నలుసుగా కేటీఆర్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అరెస్టు అంశాన్ని ముందుకు తెచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? అన్న అంశాలపైనా ప్రభుత్వం పరిశీలిస్తుందని, కాంగ్రెస్‌కు మైలేజీ తగ్గుతున్నదా? అని కూడా చెక్ చేసుకుంటుందని వారు భావిస్తున్నారు.
KTR:ఈ దశలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సంశయం రాజకీయ సర్కిళ్లలో నెలకొన్నది. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే మాత్రం కేసీఆర్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉన్నదని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ దశలో అటు హరీశ్‌రావు, కవిత కీలకంగా వ్యవహారిస్తారని కూడా అంచనా వేస్తున్నారు. అసలు కేటీఆర్ అరెస్టు నిజమా? ఊహాజనితమా? కాంగ్రెస్ డైవర్ట్ రాజకీయమా? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనున్నది.