KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ రెండోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అయితే, ఈ నోటీసులను ఆయన నివాసమైన నందినగర్‌లోని ఇంటి గోడకు పోలీసులు అతికించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణను సాధించిన నాయకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికే తన ప్రస్తుత నివాసం వివరాలను పోలీసులకు స్పష్టంగా తెలియజేశారని, అలాంటప్పుడు ఆయన లేని సమయంలో రాత్రికి రాత్రే వచ్చి గోడలకు నోటీసులు అంటించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం పైశాచిక ఆనందం పొందడానికేనని ఆయన ధ్వజమెత్తారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను విచారించేటప్పుడు వారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి మాట్లాడాలనే కనీస నిబంధనలను కూడా పోలీసులు మర్చిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్షాలను వేధిస్తున్నారా అని నిలదీశారు. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడబోమని, ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుడు పనిని ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
