KTR

KTR: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. అసలు యుద్ధం 2028లోనే!

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాజకీయాలపై, పార్టీ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమని చెబుతూ, గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కూడా కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తుచేశారు. బానిసత్వం లేని ఏకైక పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అని ఆయన గట్టిగా చెప్పారు. అయితే, అసలు యుద్ధం 2028లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల ముందు పెడదామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేసీఆర్‌ చేసిన సేవలను కేటీఆర్‌ ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రాంతంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను కేసీఆర్‌ చేపట్టారని, గొలుసుకట్టు రిజర్వాయర్ల పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్‌ రెడ్డి పేరు పెట్టడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. అలాగే, గతంలో కరెంట్‌ కష్టాల వల్ల ఎంతమంది చనిపోయారో ప్రజలందరికీ తెలుసని గుర్తు చేస్తూ, వైఎస్‌ హయాంలో ఆరు గంటలే కరెంట్‌ ఇచ్చేవారని, కాంగ్రెస్‌ పాలనలో దొంగలు కొట్టే సమయంలో కరెంటు ఇచ్చేవారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కేటీఆర్‌ విశ్లేషించారు. పార్టీ నాయకుల అనైక్యతే ప్రధాన కారణమని, అలాగే తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామని అంగీకరించారు. సోషల్‌ మీడియాలో ప్రత్యర్థులు చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారని అన్నారు. ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే, రాహుల్‌ గాంధీ వచ్చి లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధం చెప్పినా ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. ప్రజలు ఆరు గ్యారంటీలు అనే గారడిలో పడి మోసపోయారని అన్నారు. కల్వకుర్తి ఆస్పత్రి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం చేశావని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని నిలదీస్తే, ఫ్రీ బస్సు అంటున్నారని, మహిళలకు ఫ్రీ అంటూ పురుషుల నుంచి డబుల్‌ రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి రైతుబంధును ఎగ్గొట్టేసరికి ప్రజలకు కేసీఆర్‌ గుర్తుకొస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఏ ఊరిలో చూసినా పది మంది గుమిగూడితే, తొందరగా కేసీఆర్‌ను తెచ్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. ఈ ధీమాతోనే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గెలుస్తారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని కేటీఆర్‌ బలంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *