KTR: పోలవరం కాఫర్ డ్యామ్ వరుస వైఫల్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా రెండోసారి కూలిన ఈ కాఫర్ డ్యామ్‌పై ఎన్‌డీఎస్ఏ నిశ్శబ్దం ఎందుకు పాటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్ ట్వీట్‌లో విమర్శలు
“జాతీయ హోదా ఇచ్చి NDA ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా, ఎన్‌డీఎస్ఏ కళ్లముందే కనిపించడం లేదా? కాళేశ్వరం మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చినప్పుడు కాంగ్రెస్–బీజేపీ నేతలు ‘కూలేశ్వరం’ అంటూ అరిచారు. అదే ధైర్యం, అదే గళం ఇప్పుడు ‘పోలవరంను కూలవరం’ అని పెట్టగలరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
రెండు ప్రాజెక్టులకు రెండు విధానాలా?
తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక తీరు, పోలవరం ప్రాజెక్టుపై మరో తీరు అనడం న్యాయమా అని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై 24 గంటల్లోనే ఎన్‌డీఎస్ఏ దిగి వచ్చి బీజేపీ నేతలు బురదజల్లారని, కానీ కళ్లముందే రెండోసారి కూలిన పోలవరం కాఫర్ డ్యామ్‌పై మాత్రం ఎవరూ నోరు విప్పడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: టాయిలెట్‌లు దొరకడం కూడా కష్టమవుతుంది.. నెలసరి సమస్యలపై కంగనా సంచలన కామెంట్స్
గుట్టుచప్పుడు కాకుండా రిపేర్లు – తెలంగాణలో నిర్లక్ష్యం
ఏపీలో పోలవరం కాఫర్ డ్యామ్‌లో 10 అడుగుల వెడల్పు, 7–8 అడుగుల లోతు కుంగిపోయినా యుద్ధప్రాతిపదికన రిపేర్లు జరుగుతున్నాయని, కానీ తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 20 నెలలుగా చిన్న చిన్న మరమ్మత్తులు కూడా చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి మూర్ఖత్వమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
పాత వైఫల్యాలు గుర్తుచేసిన కేటీఆర్
2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేళ్లకే కొట్టుకుపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇటీవలి కాలంలో పోలవరం కాఫర్ డ్యామ్ మళ్లీ గోదావరిపాలైనా, ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మృతి చెందినా ఎన్‌డీఎస్ఏ ఏ చర్య తీసుకోలేదని కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణకు హామీ
“పంజాబ్‌ను మించిపోయే స్థాయిలో వ్యవసాయ విప్లవం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కక్షతో మూకుమ్మడి కుట్రలు పన్నుతున్నా, ఆ కుట్రలను మట్టికరిపిస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.