KTR

KTR: కాంగ్రెస్‌ పాలనలో కష్టాలే మిగిలాయి

KTR: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మంగళవారం జనగామలో నిర్వహించిన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో లేని కరెంటు కోతలు, యూరియా కొరత ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయని, రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ భౌగోళిక పరిస్థితిపై కనీస అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి, నీటి మళ్లింపు ఎలా జరుగుతుందో తెలియని వ్యక్తి.. తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు నీళ్ల గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్‌ను ఉరితీయాలన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి, స్వరాష్ట్రాన్ని తెచ్చినందుకా ఆయనను ఉరితీసేది అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని ప్రజలు ఎలాగైతే మర్చిపోయారో, రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.

సర్పంచుల హక్కుల కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే, అవసరమైతే తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతామని భరోసా ఇచ్చారు. వచ్చే మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *