KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మాగంటి సునీతాగోపీనాథ్ ఇంటికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (శనివారం (నవంబర్ 15న) వెళ్లారు. మాగంటి సునీతాగోపీనాథ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా కేటీఆర్ పరామర్శించారు. ఓటమితో కుంగిపోకుండా ఉండాలని, ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం నూరిపోశారు.
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సమయంలో ఆయన సతీమణి మాగంటి సునీతాగోపీనాథ్‌నే ఆ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అధికార, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను విజయం వరించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌పై నవీన్‌యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
KTR: ఈ నేపథ్యంలో ఓటమిపాలైన మాగంటి సునీతాగోపీనాథ్ కుటుంబాన్ని ఓదార్చేందుకు కేటీఆర్ వారింటికి వెళ్లారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలిస్తే పొంగిపోయేది లేదని, ఓడిపోతే కుంగిపోవద్దని, ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలని మాగంటి సునీతాగోపీనాథ్‌కు కేటీఆర్ సూచించారు. మనలను నమ్మి మనకు ఓటు వేసిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆమెకు సూచించారు.
KTR: నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని సునీతాగోపీనాథ్‌ను కేటీఆర్ కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకుందామని చెప్పారు. రాజకీయాలకు కొత్త అయినా, ఎన్నికల ప్రచారంలో తల్లి గెలుపు కోసం పిల్లలు చేసిన కృషి కూడా గొప్పదని గోపీనాథ్, సునీత కుమార్తెలను అభినందించారు. ఎన్నికల రోజు కాంగ్రెస్ చేసిన అక్రమాలపై ధైర్యంగా పోరాడారని సునీతను కేటీఆర్ ప్రశంసించారు.

