KTR: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అంటూ ఆశలు కల్పించిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు టోపీ పెట్టిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఈ ఆరు గ్యారంటీల ఫైలుపై మొదటి సంతకం చేశారని, కానీ ఇప్పటివరకు ఆ గ్యారంటీల్లో కనీసం సగం కూడా అమలు కాలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసలు సీఎం సంతకం చేసిన ఆ దస్త్రం ఏమైందో ఎవరికీ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల పట్ల చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. అందుకే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే శుక్రవారం నాడు ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఇచ్చిన హామీలే కాబట్టి, ఈ బిల్లుకు వారు కూడా మద్దతు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా మహిళలకు నెలకు ఇస్తానన్న రూ. 2,500 సాయం, పింఛను మొత్తాన్ని రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచడం వంటి పనులు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేల పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. తాము ప్రవేశపెట్టే బిల్లు గనుక పాస్ అయితే, ఈ హామీలన్నీ చట్టప్రకారంగా అమలవుతాయని, అప్పుడు ప్రభుత్వం తప్పించుకోవడానికి అవకాశం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.
