KTR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న వేళ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ ఫిరాయింపులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల తీరు ‘ఆహా నా పెళ్ళంట’ సినిమా కథ మాదిరిగా ఉందని ఆయన చమత్కరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అరచేతిలో వైకుంఠం చూపించి వచ్చారు: కాంగ్రెస్‌పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు “అరచేతిలో వైకుంఠం” చూపించి, ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కొద్ది నెలల్లో నిజంగా జరిగింది ఏదైనా ఉందంటే, అది కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, దాని ఖర్చును మగవాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు గుంజుతూ భర్తీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్రవర్తిలా ఫీలవుతున్నారు!
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కేటీఆర్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు చక్రవర్తి లాగా ఫీల్ అవుతున్నారని, ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఆయన విమర్శించారు.
కార్పొరేటర్ ఫిరాయింపులు, మంత్రుల అవహేళన
తన పార్టీ తరఫున గెలిచిన బంజారాహిల్స్ కార్పొరేటర్‌ను తమ పార్టీ మేయర్‌ను చేసిందని, అయితే ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ, ఈ ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం కారణంగా వచ్చిందని గుర్తు చేశారు. తమ పార్టీ గోపీనాథ్ గారి భార్యకు టికెట్ ఇచ్చిందని, ఎన్నికల ప్రచారంలో ఆమె దివంగత భర్తను గుర్తు చేసుకుని బాధతో కన్నీరు పెట్టుకుంటే, కాంగ్రెస్ మంత్రులు ఆమెను అవహేళన చేయడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు.

