KTR: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) తెలంగాణ భవన్‌లో తమ పార్టీలోని బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల విడుదలైన కులగణన సర్వే నివేదికపై తీవ్రంగా స్పందించారు.
కులగణనలో తప్పులు – బీసీలకు అన్యాయం
కేటీఆర్ మాట్లాడుతూ, తాజా కులగణన నివేదికలో బీసీ జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని ఆరోపించారు. దాదాపు 22 లక్షల మంది బీసీలను లెక్కలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ గణనను తప్పుడు లెక్కలతో తయారు చేశారని విమర్శించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించడం అశాస్త్రీయమని, ఇది పూర్తిగా తప్పుల తడకగా మారిందని అన్నారు.
రీ సర్వే డిమాండ్ – రేవంత్ క్షమాపణ చెప్పాలి
ఈ కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ నివేదికను తగలబెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, బీసీ జనాభాపై పునఃసర్వే చేయాలని స్పష్టంగా తెలిపారు.
కాంగ్రెస్ ఆరోపణలపై కేటీఆర్ స్పందన
కులగణన సర్వేలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను పాల్గొనలేదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.ఈ సమావేశంలో బీసీ నేతలు కూడా పాల్గొని 42% రిజర్వేషన్ డిమాండ్, బీసీలకు న్యాయం వంటి అంశాలపై చర్చించారు.