KTR

KTR: ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ..

KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు అన్నీ ఇస్తామంటూ ‘దానకర్ణ’లా మాట్లాడిన రేవంత్, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి ‘కుంభకర్ణ’లా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.

రేషన్ కార్డులపై మంత్రులకే అవగాహన లేదు

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కొత్త కార్డుల సంఖ్యపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెబితే, కోమటి రెడ్డి మరో మాట చెబుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం దగ్గర స్పష్టమైన గణాంకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రపంచంలో ‘420’ (మోసం) మ్యాచ్‌లు పెడితే, అందులో కాంగ్రెస్ నాయకులే కచ్చితంగా గెలుస్తారని సెటైర్లు వేశారు.

ఢిల్లీకి తరలుతున్న తెలంగాణ సంపద

రాష్ట్ర కేబినెట్ సమావేశాలు హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో జరుగుతున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజాధనం పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వాడటం దారుణమని మండిపడ్డారు. “ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం కోసం నిధులు తీసుకువస్తే సంతోషిస్తాం. కానీ, ఇక్కడి నిధులను అక్కడికి తీసుకుపోవడం రాష్ట్ర దౌర్భాగ్యం” అని వ్యాఖ్యానించారు. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో కాకుండా తిరోగమనం దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పడిపోయిన రియల్ ఎస్టేట్.. అయోమయంలో పాలన

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ అన్నారు. ఐటీ రంగానికి గర్వకారణమైన ‘టీ హబ్’ (T-Hub) లోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని చూడటం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. పాలనపై ముఖ్యమంత్రికి పట్టు లేదని, ఆయనకు తెలియకుండానే అధికారులు కొన్ని వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి సూచనలు తీసుకుని రాష్ట్రాన్ని కాపాడాలని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *