KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు ఘాటుగా సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్‌లో ఖండించిందని తెలిపారు.
“మన హయాంలో రాష్ట్ర అప్పు కేవలం ₹3,50,520.39 కోట్లు మాత్రమే. కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పినట్లుగా 8 లక్షల కోట్లు కాదు” అని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్ 8 లక్షల కోట్ల అప్పులపై తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు.
అప్పులు కూడా వ్యర్థంగా కాకుండా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకే వినియోగించామని తెలిపారు.
కేటీఆర్ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆస్తుల విలువ ₹4,15,099.69 కోట్లు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ ₹64,579 కోట్లు ఎక్కువ అని వివరించారు.

