KTR: రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసింది?

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు.

ముఖ్యంగా రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర అప్పు రూ. 3.5 లక్షల కోట్లు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ అప్పుతో ఊరికే కూర్చోలేదని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, పాత అప్పుల పేరుతో సాకులు వెతుకుతోందని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Traffic Jam: నిర్మాణంలో ఉన్న 6 ఫ్లై ఓవర్లు.. హైవేలపై చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్..

హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. “నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా?” అని కేటీఆర్ నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి, ‘హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను కూల్చివేస్తూ సామాన్యులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో పేదలకు చేసింది ఏమీ లేదని, కేవలం కూల్చివేతలు, అబద్ధపు ప్రచారాలతోనే కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *