KTR: తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఫిదా అయ్యానని, నగర ప్రజలకు ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా తక్కువేనని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తమ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్నది కేవలం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ, ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
ముఖ్యంగా పింఛన్ల పెంపు గురించి ప్రశ్నిస్తూ.. పెంచుతామన్న పింఛన్లను ఎప్పటి నుంచి ఇస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హామీల గురించి అడిగితే సీఎం బూతులతో సమాధానం ఇస్తున్నారని, తమకు కూడా తిట్టడం వచ్చు కానీ సంస్కారం అడ్డు వస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కేవలం అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారని, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ తట్టుకోలేరని ఆయన పేర్కొన్నారు.
